వ్యాక్సిన్‌ రెండో డోసు : క్షణాల్లో విషాదం

3 Mar, 2021 11:43 IST|Sakshi

 కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న కొద్దిసేపటికే అనారోగ్యం

 ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూత

సాక్షి, ముంబై:  ఒకవైపు దేశంలో కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన దేశ ప్రజలను మరింత  వణికిస్తోంది. అయినా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలామంది ఒకింత భయపడుతున్న తరుణంలో మహారాష్ట్రలో వ్యాక్సిన్‌  రెండవ డోసు తీసుకొన్న కొద్ది సేపటికే ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. థానే జిల్లా భివాండిలోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండవ మోతాదును ఇచ్చిన కొద్దిసేపటికే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు.

స్థానిక వైద్యుడి డ్రైవర్‌గా పనిచేస్తున్న సుఖ్‌దియో కిర్దిట్ నిన్న (మంగళవారం) ఉదయం 11 గంటల సమయంలో వ్యాక్సిన్‌ డోస్‌ స్వీకరించాడు. కొద్దిసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్టు  ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మూర్ఛపోయాడు. వెంటనే  అధికారులు కిర్దిట్‌ను సమీపంలోని ఐజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు  ప్రకటించారన్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కిర్దిట్ మరణానికి కారణం తెలుస్తుందని భివాండి నిజాంపురా మున్సిపల్ కార్పొరేషన్  ఆరోగ్యం ఆఫీసర్ డాక్టర్ కేఆర్‌ ఖరత్  తెలిపారు. కిర్డిట్ మెడికల్‌ హిస్టరీ, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

కాగా వ్యాక్సినేషన్  రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.  ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు మొదటి దశలో  వ్యాక్సిన్‌ను అందించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తగా జనవరి 28 న కిర్దిట్ వ్యాక్సిన్‌ మొదటి మోతాదు తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు