చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు

19 Dec, 2022 16:59 IST|Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌: కొందరు పనిని దైవంలా భావిస్తున్నారు. ఏమీ ఆశించకుండా.. తమ వంతు ప్రయత్నం చేసుకుంటూ పోతారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాలను సైతం పక్కన పెడుతుంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా.. ఓ మహిళా ఎమ్మెల్యే సైతం అలాంటి నిబద్ధతను కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 

చేతిలో రెండు నెలల చంటి బిడ్డతో సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సరోజ్‌ అహిరే. చంటి బిడ్డను బ్లాంకెట్‌లో చుట్టుకుని ఆమె అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది అతి చర్యగా అనుకుంటారని ఏమో.. ఆమె తన వివరణ సైతం ఇచ్చుకుంది. 

నేను ఇప్పుడు ఒక తల్లిని. కానీ, ఇంతకు ముందు నుంచే ప్రజల ప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల అసెంబ్లీ సెషన్‌ నాగ్‌పూర్‌లో నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తున్నారు. తల్లిని అయినప్పటికీ.. నా విధిని నేను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానాలు చెప్పాలి కదా అని వివరణ ఇచ్చారామె.

దియోలాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సరోజ్‌ అహిరే.. సెప్టెంబర్‌ 30వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆమెకు పలువురు అభినందనలు తెలపడంతో పాటు.. బాధ్యతకు పెద్ద పీట వేస్తూ ఆమె చేసిన పనిని అభినందించారు కూడా. అందులో సీఎం ఏక్‌నాథ్‌ షిండే కూడా ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు