Cabinet Expansion: ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు

16 Dec, 2022 17:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టత రాలేకపోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సందిగ్ధంలో పడిపోయింది. శిందే, ఫడ్నవీస్, అమిత్‌షా మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలపై 30 నిమిషాలపాటు కీలక సమావేశం జరిగినప్పటికీ కనీసం మంత్రివర్గ విస్తరణ తేదీ కూడా నిర్ణయించలేక పోయారు. దీంతో మంత్రివర్గ విస్తరణ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాలుగు నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో శిందే, ఫడ్నవీస్‌సహా 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అప్పట్లో మిగతా వాటిలో 13 శాఖలు శిందే తమ వద్దే ఉంచుకున్నారు. క్యాబినెట్‌లో తమకు స్ధానం లభించకపోవడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు శిందే వర్గం, అటు ఫడ్నవీస్‌ వర్గం ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

మంత్రివర్గంలో తమకు ఎప్పుడు స్ధానం లభిస్తుందా..? అని ఇరువర్గాల ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో దశ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నెల రోజుల కిందట శిందే ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారం తగ్గుందని తెలిపారు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలలో కొంత ఆశలు చిగురించాయి. కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతోనప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శీతాకాల సమావేశాల్లో తన వద్ద ఉన్న 13 శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఒక్కరే సమాధానమివ్వడం సాధ్యం కాదని శిందే ముందే తెలుసుకున్నారు.

దీంతో శిందే తన వద్ద ఉన్న 13 శాఖల బాధ్యతలు ఇతర మంత్రులకు అప్పగించారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఇరు వర్గాల ఎమ్మెల్యేలకు పరోక్షంగా తెలిసిపోయింది. కాని త్వరలో అమిత్‌ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి ఒక స్పష్టత తీసుకొస్తామని శిందే, ఫడ్నవీస్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో శిందే, ఫడ్నవీస్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శిందే, ఫడ్నవీస్‌ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై సుమారు 30 నిమిషాలు కేంద్ర హోంమంత్రితో చర్చించారు.

కానీ ఈ సమావేశంలో నాగ్‌పూర్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలలో ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. శీతాకాల సమావేశాల తర్వాత చేయవచ్చనే మీడియా కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. 

శీతాకాల సమావేశాల తరువాతే! 
నిజానికి శీతాకాల సమావేశాల తర్వాత చేయొచ్చని మీడియా కథనాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్‌ షాతో అర్థరాత్రి జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఫడ్నవీస్, షిండే ఇద్దరూ హాజరయ్యారు. నిజానికి శీతాకాల సమావేశాలకు ముందే షిండే–ఫడ్నవీస్‌ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముందుగా భావించారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఖరారయ్యే అవకాశం ఉంది. 

ప్రభుత్వం భయపడుతోంది... 
ప్రస్తుతం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సహా 20 మంది కేబినెట్‌ ర్యాంక్‌ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాలు దూకుడు పెంచాయి. శిందే, ఫడ్నవీస్‌లు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని డిమాండ్‌ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ భయపడుతోందని వారు వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు