కుప్పకూలిన ప్రభుత్వం.. బోసిపోయిన శివసేన కార్యాలయాలు

2 Jul, 2022 20:17 IST|Sakshi

సాక్షి, ముంబై: మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, ఆ తర్వాత శివసేన తిరుగుబాటు నేత షిండే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడం ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో చోటుచేసుకున్నాయి. కానీ, నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్న ఈ తతంగంవల్ల మంత్రాలయలో ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రుల కార్యాలయాలు, చాంబర్లు, శివసేన శాఖలు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మంత్రాలయలో తమ చాంబర్లలో, కార్యాలయాలలో ఉన్న ఫైళ్లు, వ్యక్తిగత లగేజీ సర్దుకుని తమ తమ నివాస బంగ్లాలకు వెళ్లిపోయారు. కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని మంత్రులు ఇంకా కొలువుదీరకపోవడంతో మంత్రాలయ పూర్తిగా బోసిపోయింది.

ఇటు పాత మంత్రులు లేక అటు కొత్తమంత్రులు కొలువు దీరకపోవడంతో కార్యాలయాలు, చాంబర్లు ఖాళీగా కనిపించాయి. ముఖ్యం గా మంత్రాలయలో మంత్రులెవరు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఐదో, ఆరో అంతస్తులో ఇదివరకు కనిపించిన సందర్శకుల సందడి ఇప్పుడు కనిపించడం లేదు. మంత్రాలయలో ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, క్లర్క్‌లు, కిందిస్థాయి ఉద్యోగులు మాత్ర  కనిపిస్తున్నారు.

కానీ, ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ప్యూన్లు, డ్రైవర్లు, వారి కార్లు కనిపించకుండా పోయాయి. ఎప్పుడూ మంత్రులు, వారిని కలిసేందుకు వచ్చే ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల, సంస్థల ప్రముఖులు, సామాన్య ప్రజల రాకపోకలతో బిజీగా
చదవండి: ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్‌!

శివసేన కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి 
దాదాపు 55 ఏళ్ల కిందట హిందూ హృదయ్‌ సామ్రాట్‌ బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో శివసేన పార్టీ కార్యాలయాలు, నగరంలో అక్కడక్కడున్న వందలాది శాఖలు నిర్మానుష్యంగా మారిపోయాయి. శాఖలు, స్థానిక కార్యాలయాల్లో శివసేన మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు కూర్చుండేవారు. అక్కడికి వచ్చే సామాన్య ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్, షిండే వర్గాలుగా చీలిపోవడంతో ఏ కార్యాలయం, ఏ శాఖ ఎవరి అధీనంలోకి వస్తుంది? ఎవరు సొంతం చేసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.

షిండే తిరుగుబాటు చేయడంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. దీంతో పార్టీ కార్యాలయం, శాఖలో ఎక్కడ చూసిన ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. మొన్నటివరకు పార్టీ కార్యాలయాల ఎదుట షిండేకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన శివసైనికులు ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడిగా ఉండటంతో అందరు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగరంలో అనేక చోట్ల, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. శివసేన కార్యకర్తలు ఇళ్ల నుంచి బయట పడకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని అంటున్నారు. 

మరిన్ని వార్తలు