Eknath Shinde Political Life Journey: ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం వరకు.. ఏక్‌నాథ్‌ షిండే ప్రస్థానం ఇదే

30 Jun, 2022 19:05 IST|Sakshi

సాక్షి, ముంబై: ఉద్దవ్‌ సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు. నేడు (గురువారం రాత్రి 7.30 నిమిషాలకు మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

కాగా బుధవారం సుప్రీంకోర్టు బలపరీక్షకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉద్దవ్‌ ఠాక్రే అకస్మాత్తుగా సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉద్ద‌వ్ రాజీనామా నేప‌థ్యంలో నేడు జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ ర‌ద్దు చేశారు. రాష్ట్రంలో సర్కార్‌ పడిపోవడంతో  అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో కొత్త సర్కార్‌ కొలువుదీరనుంది.

ప్రస్థానం
1964 ఫిబ్రవరి 9న సాతారా జిల్లాలోని జవాలీ తాలూకాలో ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. నిరుపేదలైన షిండే కుటుంబం పొట్టకూటి కోసం థానేకు వలస వెళ్లింది. థానేలో ఆటో డ్రైవర్‌ నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.  అనంతరం 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు.

ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శివ‌సేనపై అసంతృప్తితో ఇటీవల తిరుగుబాటు చేయడంతో జూన్ 21న శివసేన పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండగా.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు