Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!

21 Jul, 2022 04:48 IST|Sakshi

మహారాష్ట్ర ఉదంతంపై సుప్రీం

విస్తృత ధర్మాసనం పరిశీలించాలి

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్య

విచారణ ఆగస్టు 1కి వాయిదా

‘అనర్హత’లపై యథాతథ స్థితి

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్‌ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్‌ లాయర్లు కపిల్‌ సిబల్, అభిషేక్‌ మను సింఘ్వీ ఉద్ధవ్‌ వర్గం తరఫున, హరీశ్‌ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు.

ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్‌
మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్‌ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు.

పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్‌ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్‌లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్‌ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు.

సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే
సిబల్‌ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్‌ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు.

ఈ దశలో సీజేఐ జస్టిస్‌ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు.

ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు