మహారాష్ట్రలో దడపుట్టిస్తున్న H3N2.. క్రమంగా పెరుగుతున్న కేసులు.. మొత్తం ఎన్నంటే?

15 Mar, 2023 14:21 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో హెచ్‌3ఎన్‌2 దడపుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ సోకి అహ్మద్ నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. 

మార్చి 14న చనిపోయిన  అతనికి హెచ్‌3ఎన్‌2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే విద్యార్థి మృతికి గల ప్రధాన కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇతను ఇన్‌ఫ్లూయెంజాతో చనిపోయినట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ అదే జరిగితే మహారాష్ట్రలో ఇదే తొలి హెచ్‌3ఎన్‌2 మరణం అవుతుంది.

పుదుచ్చేరిలో స్కూల్స్ బంద్..
పుదుచ్చేరిలో కూడా హెచ్‌3ఎన్‌2 వైరస్ పంజా విసురుతోంది.  దీంతో పాఠశాలలను మార్చి 16 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఏ నమస్సివాయం బుధవారం అధికారికంగా ప్రకటించారు.

ఢిల్లీ ప్రభుత్వం చర్యలు..
దేశ రాజధాని ఢిల్లీలో కూడా హెచ్‌3ఎన్‌2 క్రమంగా విజృంభిస్తోంది.  దీంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆస్పత్రులతో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక బృందాలతో పాటు, ఔషధాలను సమకూర్చుతోంది. ఎల్‌ఎన్‌జేపీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది.

స్వైన్‌ఫ్లూ..
కరోనా, ఇన్‌ఫ్లూయెంజాతో పాటు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరగడం కూడా ఆందోళన కల్గిస్తోంది. ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వైవలెన్స్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నాటికి 955 హెచ్‌1ఎన్‌1(స్వైన్‌ ఫ్లూ) కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 545, మహారాష్ట్రలో 170, గుజరాత్‌లో 170, కేరళలో 42, పంజాబ్‌లో 28 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా కేసులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
చదవండి: ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే! 

మరిన్ని వార్తలు