కోవిడ్‌ ముప్పు తొలగిపోలేదు

12 Mar, 2021 02:41 IST|Sakshi
టీకా తీసుకుంటున్న మహారాష్ట్ర సీఎం ఠాక్రే

దీనిపై నిర్లక్ష్యం వద్దు

కేంద్రం హెచ్చరికలు

ఒకే రోజు 22,854 కేసులు నమోదు  

న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇంకా కోవిడ్‌ –19 సంక్షోభం సమసిపోలేదని, ముప్పు పొంచే ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె. పాల్‌ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. నాగపూర్‌ వంటి ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ కరోనాపై పోరాడిన తొలి రోజుల్లోకి వెళ్లిపోతున్నామని అనిపిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,854 కేసులు నమోదయ్యాయి. 2021లోకి అడుగు పెట్టాక నమోదైన రోజువారీ కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561కి చేరుకుంది. ఇక ఒకే రోజు 126 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,58,189కి చేరుకుంది.  

వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోండి  
మçహారాష్ట్రలో అనూహ్యంగా కేసులు పెరిగిపోతూ ఉండడంపై మనం పాఠాలు నేర్చుకోవాలని వి.కె. పాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ ఎప్పుడు, ఎందుకు, ఎలా విజృంభిస్తుందో ఇంకా అర్థం కావడం లేదన్నారు. వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ తీసుకుంటూ నిబంధనల్ని పాటిస్తేనే కరోనాని కట్టడి చేయగలమని చెప్పారు.  

10 జిల్లాల నుంచి అత్యధిక కేసులు
దేశంలో 10 జిల్లాల నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. పుణే, నాగపూర్, థానే, ముంబై, అమరావతి, జలగావ్, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, ఎర్నాకులం జిల్లా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని, ఈ జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలోనే ఉన్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర తర్వాత కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు నుంచి అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఈ 6 రాష్ట్రాల నుంచే 86 శాతం కేసులు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌  
మహారాష్ట్రలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బుధవారం ఒక్క రోజే 13,659 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యధికంగా కేసులు వస్తున్న నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నితిన్‌ రౌత్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి మరిన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ప్రభుత్వ జేజే ఆస్పత్రిలో గురువారం కోవిడ్‌ తొలి డోస్‌ తీసుకున్నారు. పనేమి లేకుండా బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసే ముందు ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతామని ఠాక్రే తెలిపారు.   

మరిన్ని వార్తలు