వీడియో: ‘వధువు కావలెను’.. బ్యాండ్‌ బాజాలతో.. పెళ్లి బట్టలతో రోడ్డెక్కి నిరసనలు

22 Dec, 2022 15:24 IST|Sakshi

ముంబై: లింగ నిష్పత్తి బేధాలు.. చాలా దేశాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో ఏకంగా జనాభా తగ్గిపోతున్న దేశాలనూ చూస్తున్నాం. కడుపులో ఉండగానే.. ఆడ బిడ్డగా నిర్ధారించుకుని చిదిమేయడం, ఇతర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది,  ఈ క్రమంలో.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ కొందరు యువకులు రోడ్డెక్కిన ఘటన మన దేశంలోనే చోటు చేసుకుంది. 

మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలో పెళ్లీడుకొచ్చిన యువకులు..  పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ వాపోతున్నారు. వయసు మీద పడుతుండడంతో తమకు పెళ్లి కూతుళ్లు దొరికేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. పెళ్లికాని ప్రసాదులంతా రోడ్ల మీద పరేడ్‌ నిర్వహించారు.  అదీ వినూత్నంగా.. 

పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్‌ మేళంతో మరికొందరు.. తమకు వధువులు కావాలంటూ డిమాండ్‌ వినిపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆపై  జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.  మహారాష్ట్రలో మగ-ఆడ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం అమలయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్‌(జిల్లా మెజిస్ట్రేట్‌) వినతి పత్రం సమర్పించారు.

వీళ్లంతా బ్రైడ్‌గ్రూమ్‌(వరుడి) మోర్చా పేరిట ఏర్పాటు చేసిన ఓ సంఘంలోని సభ్యులు. ‘‘మమ్మల్ని చూసి నవ్వుకున్నా ఫర్వాలేదు. కానీ, పెళ్లీడు వచ్చినా.. చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదు. వయసు మీద పడుతోంది. ఇదంతా రాష్ట్రంలో పురుష-స్త్రీ లింగ నిష్పత్తి రేటు పడిపోవడం వల్లే’’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేశ్‌ బరాస్కర్‌ తెలిపారు. 

మహారాష్ట్రలో పురుష-స్త్రీ నిష్పత్తి రేటు 1000 మందికి 889 మందిగా ఉంది. భ్రూణ హత్యలు.. అసమానతల వల్లే ఈ సమస్య తలెత్తిందని,  ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని పలువురు యువకులు కోరుతున్నారు. 

ये बारात नहीं प्रदर्शन है...जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw

ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ నిషేధ చట్టాలను పటిష్టం చేయాలని యువకులు కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే షోలాపూర్‌ జిల్లా మాల్‌షిరాస్‌ తాలుకా అక్లుజ్‌లో ఒక యువకుడు.. కవలలైన అక్కాచెల్లెలను వివాహం చేసుకున్న ఘటన ఈమధ్యే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది కూడా. 

మరిన్ని వార్తలు