మా ఆదేశాలే అపహాస్యమా?

14 Oct, 2023 05:59 IST|Sakshi

మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీం ఆగ్రహం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఇంకెప్పుడు?

అసెంబ్లీ ఎన్నికల దాకా కాలయాపన చేయదలచారా?

తీవ్రస్థాయిలో మండిపడ్డ సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్‌ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్‌ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం.

ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్‌ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్‌ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. 

వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్‌ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి.

స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది!
మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్‌ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్‌ జనరల్‌ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్‌ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్‌ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్‌ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్‌ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు