Maharashtra: దసరా ర్యాలీ.. హైకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రేకు భారీ ఊరట..

23 Sep, 2022 18:16 IST|Sakshi

సాక్షి, ముంబై: గత కొన్ని రోజులుగా తార స్థాయికి చేరిన దసరా ర్యాలీ(సదస్సు) వివాదంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కోర్టుకు వరకు వెళ్లిన ఈ పంచాయతీలో ఉద్దవ్‌ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు వెలువడింది. శీవాజీ పార్క్‌ మైదానంలో అక్టోబర్‌ 2 నుంచి 6 మధ్యన దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా శివాజీ పార్క్‌ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతివ్వాంటూ శివసేన హైకోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దసరా ర్యాలీని నిర్వహించేందుకు కోర్టు ఉద్దవ్‌ ఠాక్రేకు అనుమతిని ఇచ్చింది. అయితే శాంతిభద్రతల నడుమ ర్యాలీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు ఆదేశాల అనంతరం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేశారు. ‘ఒకే పార్టీ నాయకుడు, ఒక శివసేన, ఒకే శివతీర్థం. ఒకే దసరా సమావేశం. అక్టోబర్ 5న పులి గర్జన వినబడనుంది.’ అని ట్వీట్ చేశారు. కాగా లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్ల  విరామం  తర్వాత శివాజీ పార్క్‌లో ఈ ఏడాది దసరా ర్యాలీ నిర్వహించనున్నారు.
చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!

వివాదం ఏంటి?
అక్టోబర్‌ నెలలో దసరా ర్యాలీ కోసం శివాజీ పార్క్‌ మైదానం అద్దెకివ్వాలని గత నెలలోనే(ఆగస్టు 22) శివసేన దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత వారం రోజులకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం తరపున స్థానిక శివసేన ఎమ్మెల్యే సదా సర్వస్కర్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు మైదానం అద్దెకిచ్చే విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్దవ్‌ వర్గం మరోసారి(ఆగస్టు26) దరఖాస్తు చేసుకున్నప్పటికీ బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

బీఎంసీ నియమ నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతివ్వాలి. కానీ శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ వర్గానికి శివాజీ పార్క్‌ మైదానం అద్దెకివ్వకూడదని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అయితే నెలరోజులులైనా బీఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్దవ్‌ ఠాక్రే వర్గం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

నాలుగు సార్లు మినహా 55 ఏళ్లుగా..
దాదాపు 55 ఏళ్ల కిందట బాల్‌ ఠాక్రే శివసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ సుదీర్ఘ కాలంలో నాలుగు సార్లు మినహా ఏటా శివాజీ పార్క్‌ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. 2012లో బాల్‌ ఠాక్రే చనిపోయిన తర్వాత ఈ పరంపరాను ఆయన తనయుడు ఉద్దవ్‌ ఠాక్రే కొనసాగిస్తున్నారు. దీంతో శివాజీ పార్క్‌ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించే హక్కు ప్రథమంగా తమకే ఉందని ఉద్దవ్‌ వర్గం వాదిస్తోంది. 
చదవండి: సిగరెట్‌ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు

>
మరిన్ని వార్తలు