Maharashtra Crisis Updates: శివసేన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఇరు వర్గాల వాదనలివే!

29 Jun, 2022 20:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శివసేన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణ కొనసాగుతోంది. శివసేన తరపున అభిషేక్‌ సింఘ్వి, షిండే తరపున ఎంకే కౌల్‌ వాదనలు వినిపించారు. మరోవైపు సుప్రీంకోర్టు విచారణను సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నిశితంగా గమనిస్తున్నారు. సుప్రీం తీర్పును అనుసరించి సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ బల పరీక్షలకు సుప్రీం అనుమతిస్తే రాజీనామా చేస్తానని కేబినెట్‌ భేటీలో సీఎం ప్రకటించిన విషయం తెలసిందే.

రేపు బల పరీక్ష సాధ్యం కాదు
బల నిరూపణకు ఒక రోజు మాత్రమే సమయం ఇవ్వడం అన్యాయమని శివసేన లాయర్‌ సింఘ్వి కోర్టుకు వాదనలు వినిపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని, మరికొంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో బల పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రేపు సాధ్యం కాదని అన్నారు. బల పరీక్ష, అనర్హత పరస్పర సంబంధం ఉన్న వ్యవహారాలని, అనర్హత పిటిషన్‌ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.  విపక్ష నేతలు చెప్పినట్లు గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనర్హులైన ఎమ్మెల్యేలను బల పరీక్ష నుంచి మినహాయించాలని కోరారు.

అయితే ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో మీరు ఎలా నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. 16 మందిని అనర్హులుగా ప్రకటించమని స్పీకర్‌ను కోరారని.. స్పీకర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అలాంటప్పుడు వారు ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు.
చదవండి: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్‌ భావోద్వేగం

బలపరీక్ష ఆపొద్దు
ప్రజాస్వామ్యంలో బలపరీక్ష కీలకమైందని, ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్షను ఆపొద్దని షిండే లాయర్‌ ఎంకే కౌల్‌ వాదనలు వినిపించారు. గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయన్నారు. మెజార్జీ ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి విశ్వాసాన్ని కోల్పోతే బల పరీక్ష అత్యవసరమన్నారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్‌ ఠాక్రే విశ్వాసాన్ని కోల్పోయారన్నారు.

‘కోవిడ్‌ నుంచి కోలుకున్న గవర్నర్‌ రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించకూడదా? బల పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎంకు ఇష్టం లేదంటేనే.. ఆయన విశ్వాసం కోల్పోయారని అర్థమవుతోంది. 9 మంది ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు షిండేనే సమర్థిస్తున్నారు. షిండే వర్గానిదే అసలైన శివసేన. బల పరీక్షల కోసం గవర్నర్‌కు కేబినెట్‌ సలహాలు అక్కర్లేదు. సభలో మెజారిటీ నిరూపణకు బలపరీక్షే ఆయుధం. స్పీకర్‌ను ఉంచాలా;.. తొలగించాలా? అన్నది ముందు నిర్ణయించాలి. అనర్హత పిటిషన్‌, ఫ్లోర్‌ టెస్ట్‌.. రెండు వేరు వేరు అంశాలు’ అని కోర్టుకు తెలిపారు. మధ్యప్రదేశ్‌ అంశాన్ని ప్రస్తవించిన షిండే లాయర్‌.. బలనిరూపణను వాయిదా వేస్తే బేరసారాలు జరిగే అవకాశం ఉందన్నారు.
చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్‌నాథ్‌ షిండే ప్లాన్‌ ఇదే!

మరిన్ని వార్తలు