మహారాష్ట్రలో వ్యాక్సిన్‌ కొరత

8 Apr, 2021 03:16 IST|Sakshi

మరో 3 రోజులకే టీకాలున్నాయన్న ఆరోగ్య మంత్రి

కరోనా కట్టడిలో మహారాష్ట్ర విఫలం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల డోసుల టీకాలు మాత్రమే ఉన్నాయని, అవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయన్నారు. వ్యాక్సిన్‌లు అందుబాటులో లేక చాలా చోట్ల టీకా కేంద్రాలను మూసే పరిస్థితి ఏర్పడిందన్నారు.  ‘గతంలో రోజుకి 4 లక్షల మందికి టీకా ఇచ్చేవాళ్లం. రోజుకి ఆరు లక్షల డోసులు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం రోజుకి 5 లక్షల మందికి టీకా ఇస్తున్నాం. కానీ టీకాల నిల్వ రోజుకీ తగ్గుతోంది’ అని వివరించారు.

మహారాష్ట్రలో కరోనా విస్తృతి దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా 50 వేలు దాటిందని తెలిపారు. అందువల్ల, మహారాష్ట్రకు అధిక మొత్తంలో టీకాలను పంపించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని  కోరారు. కరోనా సోకుతున్న వారిలో  20–40 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నందున, వారికి కూడా టీకా అందించేలా ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. టీకాల కొరత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్‌ వెల్లడించారు.  ఇప్పటివరకు కేంద్రం నుంచి 1.06 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ రాగా, 88 లక్షల డోసులను పౌరులకు ఇచ్చామని  రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే..  
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీకాల కొరత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. సరిపోను టీకాలు లేవంటూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కొరత వాదన అర్థం లేనిదన్నారు.   టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, క్వారంటైన్‌పై  రాష్ట్ర ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు

మరిన్ని వార్తలు