పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో యువతి.. మెడికల్‌ టెస్ట్‌లో ‘అతడు’గా తేల్చి జాబ్‌కు నో! ఆపై..

14 May, 2022 17:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి.. మెడికల్‌ టెస్టుల్లో మాత్రం ఊహించిన పరిణామం ఎదురైంది. ఆమె ఆమె కాదు.. అతడు అని ధృవీకరిస్తూ ఉద్యోగం ఇవ్వలేమని తేల్చి చెప్పింది రిక్రూట్‌మెంట్‌ బోర్డు. ఈ తరుణంలో ఆమె న్యాయపోరాటంలో విజయం సాధించింది. 

బాంబే హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెడికల్‌ టెస్టుల వల్ల ఉద్యోగం దక్కకుండా పోయిన ఓ యువతికి.. రెండు నెలల్లో అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

2018లో సదరు యువతి (23) నాసిక్‌ రూరల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ 2018కి ఎస్సీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎగ్జామ్‌లు అన్నీ క్వాలిఫై అయ్యింది. అయితే మెడికల్‌ ఎగ్జామ్‌లో ఆమె జనానాంగాలు లేవని గుర్తించారు. మరో పరీక్షలో ఆమెలో మగ-ఆడ క్రోమోజోమ్స్‌ ఉన్నట్లు తేడంతో ఆమెను పురుషుడిగా నిర్ధారించి పక్కనపెట్టారు. 

ఈ పరిస్థితిలో ఉద్యోగం రాకపోవడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకున్న జన్యుపరమైన సమస్య గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదని, పుట్టినప్పటి నుంచి తాను మహిళగానే పెరిగాని, చదువు కూడా అలాగే కొనసాగిందని, ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో కార్యోటైపింగ్ క్రోమోజోమ్‌ టెస్ట్‌ల ద్వారా ఆమెను పురుషడిగా గుర్తించడం ఏమాత్రం సరికాదన్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌.. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తరుణంలో.. సానుభూతి ధోరణితో యువతికి ఉద్యోగం ఇప్పించేందుకు పోలీస్‌ శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ అశుతోష్‌ కుంభకోణి హైకోర్టుకు వెల్లడించారు.

చదవండి: గుడ్‌ బై.. గుడ్‌ లక్‌.. కాంగ్రెస్‌కు షాక్‌

మరిన్ని వార్తలు