మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌..

4 Apr, 2021 19:57 IST|Sakshi

ముంబై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశలో కరాళనృత్యం చేస్తుండటంతో, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ(రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు)తోపాటు వీకెండ్‌ లాక్‌డౌన్‌ను(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు) అమలు చేయాలని ఆదివారం సంచలన ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, 50శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నడిపించాలని ఆదేశించింది.

అయితే, హోటళ్లలో పార్శిల్ సేవలకు మాత్రం మహా సర్కారు అనుమతులు ఇచ్చింది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో మహా సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ముఖ్యమంత్రి  ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీకెండ్‌ లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో శనివారం కొత్తగా 49,447 కేసులు నమోదు కాగా, 277 మరణాలు సంభవించాయి. 

మరిన్ని వార్తలు