చెత్త ప్రశ్నలు అడిగారు: మహువా మెయిత్రా

2 Nov, 2023 13:04 IST|Sakshi

ఢిల్లీ: ఎథిక్స్ కమిటీ సభ్యులు చెత్త ప్రశ‍్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా తెలిపారు. అనైతిక, వ్యక్తిగత ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి బయటకొచ్చారు.

ప్యానెల్‌ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతోందంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.  ఏదేదో విషయాలు తీస్తూ చెత్తగా మాట్లాడుతున్నారని మహువా తెలిపారు. ‘మీ కళ్లలో నీళ్లు ఉన్నాయని అంటున్నారు. నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అని మీడియా ముందు మహువా ప్రశ్నించారు.

‘వ్యక్తిగత సంబంధం’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసు నమోదుకు కారణమైనట్లు ఎథిక్స్‌ కమిటీకి మహువా మెయిత్రా తెలిపారు.  కాగా గతంలోనూ తనపై వచ్చిన ఆరోపణల వెనుక తన మాజీ ప్రియుడు జైన్ అనంత్ దేహద్రాయ్ హస్తం ఉన్నట్లు మెయిత్రా పేర్కొన్నారు.

డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు ‍అడిగారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. మూడు కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి ఎథిక్స్ కమిటీకి వచ్చిన నివేదికలతో పాటు ఇతర పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా మహువా మొయిత్రాను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హోం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నివేదికలు ఎథిక్స్ కమిటీ వద్ద ఉన్నాయి. 

ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు కూడా చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు.

ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే.. తనకు లంచం ఇచ్చినట్లు బయటకొచ్చిన అఫిడవిట్‌పై హీరానందానీని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఎథిక్స్ కమిటీని కోరారు.

ఇదీ చదవండి: దుబాయ్ నుంచి 47 సార్లు.. మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు

మరిన్ని వార్తలు