Mainpuri ByPolls: ములాయం ఇలాకాలో బరిలోకి డింపుల్‌.. ఎస్పీ అధికారిక ప్రకటన

10 Nov, 2022 13:15 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. 

ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించింది.  పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని  మెయిన్‌పురి పార్లమెంట్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్‌ 8వ తేదీన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. 


మామ ములాయంతో డింపుల్‌ (పాత ఫొటో)

మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్‌ యాదవ్‌.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం.  దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది.


భర్త అఖిలేష్‌తో డింపుల్‌

మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్‌ యాదవ్‌(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి..  2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్‌ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్‌. ఆపై  2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్‌ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్‌ పాథక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె.

మరిన్ని వార్తలు