Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు

5 Dec, 2022 05:53 IST|Sakshi
తాము సృష్టించుకున్న అడవి ముందు సగర్వంగా నిలబడ్డ ఆంచల గ్రామ గిరిజన మహిళలు

ఒడిశాలో గిరిజన మహిళల ఘనత

కోరాపుట్‌ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్‌ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది.

దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది.

ఒక్కతాటిపై నిలిచి...
అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు.

చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది.

కొసమెరుపు
30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్‌ లొకేషన్స్‌.. ఎక్కడంటే!)

మరిన్ని వార్తలు