ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం

29 Nov, 2022 15:05 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రిని రావణుడితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని బెహ్రామ్‌పుర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

‘మేము మీ(మోదీ) ముఖాన్ని కార్పొరేషన్‌ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సహా ప్రతిచోటా చూస్తున్నాం. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, ఎమ్మెల్యే సహా ఏ ఎన్నికల్లోనైనా మోదీజీ పేరుతో ఓట్లు అడుగుతుండటం గమనించాను. మోదీ మున్సిపాలిటీల్లోకి వెళ్లి పని చేస్తారా? మీకు అవసరమైనప్పుడు మోదీ వచ్చి సాయం చేస్తారా?’ అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే. 

ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవియా. ఆయన వ్యాఖ్యలు ప్రధాని మోదీని అవమానించటమేనన్నారు. ‘గుజరాత్‌ ఎన్నికల వేడిను తట్టుకోలేక కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాటలు అదుపుతప్పుతున్నాయి. దాంతోనే ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. గుజరాత్‌ను, ఆ రాష్ట్ర బిడ్డను కాంగ్రెస్‌ అవమానుస్తూనే ఉంది.’ అని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర సైతం ఖర్గేపై మండిపడ్డారు. పీఎం మోదీని రావణుడితో పోల్చడంతో యావత్‌ దేశం దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ తీరును సూచిస్తున్నాయని విమర్శించారు.

ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల

మరిన్ని వార్తలు