అవును నిజమే.. అయితే ఏంటి?

4 Dec, 2020 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘అవును నిజమే.. నా శరీరానికి వైకల్యం ఉంది. అయితే దానర్థం నేనేమీ సాధించలేనని కాదు. మిగతా వారికంటే కాస్త భిన్నమైన దారిలో పయనిస్తానని మాత్రమే అర్థం. ‘వైకల్యం’ అనేది నేను చేయాలనుకున్న పనులు చేయకుండా నన్ను అడ్డుకోలేదు. కాబట్టి ఇంటర్నేషనల్‌ డిజెబిలిటీ డే సెలబ్రేట్‌ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అంటూ మోటివేషనల్‌ స్పీకర్‌ మాళవికా అయ్యర్‌ దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపారు. డిసెంబరు 3న ‘వరల్డ్‌ డిజెబిలిటీ డే’ సందర్భంగా తన పనులు తానే చేసుకుంటున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. గ్రానైడ్‌ పేలిన ఘటనలో మాళవిక చిన్నతనంలోనే తన రెండు అరచేతులను కోల్పోయారు. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు తట్టుకుని ధైర్యంగా నిలబడిన ఆమె.. స్క్రైబ్‌సాయంతో పరీక్షలు రాసి ఉన్నత విద్య పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి మోటివేషనల్‌ స్పీకర్‌గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. (చదవండి: అదే అన్నింటికంటే పెద్ద శాపం.. కాబట్టి)

ఈ క్రమంలో వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. మాళవిక తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

గత నెల 29న వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘ పదేళ్ల క్రితం.. ‘ఈ వ్యక్తితోనే మన జీవితం గడపాలని నిర్ణయించుకున్నపుడు.. ఇంక ఆలస్యం చేయకూడదు. వెంటనే దానిని అమలు చేసేయాలి’ అనే సినిమా డైలాగ్‌తో మా సంభాషణ మొదలైంది. మా బంధానికి కాలంతో పనిలేదు. హ్యాపీ యానివర్సరీ మై లైఫ్‌’’ అంటూ తన బెస్టాఫ్‌పై ప్రేమను చాటుకున్నారు.

బాల్యం రాజస్తాన్‌లో
మాళవిక అయ్యర్‌ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ణన్- హేమా క్రిష్ణన్‌. తండ్రి వాటర్‌ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో మాళవిక బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్‌ చేతుల్లో పేలింది. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్‌ హానర్స్‌ చదివారు. సోషల్‌ వర్క్‌లో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్‌ స్పీకర్‌గా మారారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు