-

వైరల్‌ వీడియో: సృష్టికర్తకు జోహార్లు

21 Jul, 2021 12:48 IST|Sakshi

జోరువానలో పిల్లల కోసం ఓ తల్లి ఆరాటం

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అమ్మ ప్రేమకు హద్దులుండవు.. అనంతం. బిడ్డల్ని సంరక్షించడంలో తల్లి తర్వాతనే ఎవరైనా. వర్షం వస్తే పిల్లలకు తాను గొడుగవుతుంది.. ఎండలో నీడవుతుంది... ఇలా అన్ని వేళలా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. అందుకే ఓ మాట అంటుంటారు.. సృష్టికర్త తాను అన్ని చోట్ల ఉండలేక.. తల్లిని సృష్టించాడంటారు. ఈ మాట అక్షరాల నిజం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే.. తల్లి ప్రేమను అనుభూతి చెందుతారు. ఆ వివరాలు..

ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుధా రామెన్‌ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో జోరుగా వర్షం కురుస్తుంటుంది. నిలువుగా పొడవుగా ఉన్న ఓ కర్రలాంటి దాని మీదున్న గూడులో ఓ కొంగ, పిల్లలతో కలిసి ఉంటుంది. పైన ఏ ఆధారం లేకపోవడంతో గూడు, దానిలోని పిల్లలు తడుస్తుంటాయి. ఈ క్రమంలో తన పిల్లలను వర్షంలో తడవకుండా ఉండటం కోసం కొంగ తన రెక్కలను తెరచి.. దాని కాళ్ల మధ్య పిల్లలను నిలుపుతుంది. అయినా పిల్లలు తడుస్తుండటంతో ఆ తల్లి కొంగ అలానే తన రెక్కలను విప్పార్చి.. కూర్చుంటుంది. 

‘‘ఎందుకంటే తనొక అమ్మ’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు ఆ కొంగ చూపిన తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ‘‘తను ఒక అమ్మ.. ప్రకృతి తనకు ప్రేమను పంచడం, రక్షించడం, దారి చూపడం వంటి ఎన్నో లక్షణాలను అందించింది. తల్లి అంటేనే ప్రేమ.. సృష్టికర్తకు జోహార్లు..’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు