నారదా స్టింగ్‌ ఆపరేషన్‌: మంత్రులకు బెయిల్‌

17 May, 2021 18:21 IST|Sakshi

ఉద్రికత్తంగా మారిన పరిస్థితులు

శాంతంగా ఉండాలంటూ అభిషేక్‌ బెనర్జీ పిలుపు

కోల్‌కతా: నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ అధికారులు ఉదయం ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మేయర్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్‌ చేయాలంటూ దాదాపు ఆరు గంటలుగా సీబీఐ కార్యాలయం నిజాం ప్యాలెస్‌ ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రుల అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు భారీ ఎత్తున సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని, బ్యారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కార్యకర్తలను చెదరగొట్టానికి రంగంలోకి దిగిన పారామిలిటరీ సిబ్బంది, పోలీసులపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. 

ఈ ఘటనపై గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలు అన్యాయంగా ప్రవర్తిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని.. రాజ్యాంగ నిమయాలను పాటించాలని కోరారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ అల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ స్పందిస్తూ.. బెంగాల్‌ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని.. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. చట్టబద్దంగానే ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. 

ఇటీవల  బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ నారద న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ సీబీఐ దాఖలు చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్‌ హకీమ్‌ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్‌, టీఎంసీలో కలవరం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు