Kaali Controversy: కాళీ మాతపై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం మమత కామెంట్స్‌ ఇవే..

7 Jul, 2022 17:48 IST|Sakshi

కోల్‌కత్తా: కాళీమాతను అవమానిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్‌ వెలిసిన వివాదం ముదిరిపోయి భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తప్పులు అందరూ చేస్తారు. కానీ, వాటిని సరిదిద్దుకోగలరు. మేము కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ, ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి అని అన్నారు. 

ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఎంపీ మొయిత్రా..  ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్‌ స్వీకరించే వ్యక్తి’, ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ’ చేస్తారని ఆమె అన్నారు. అదే బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్‌ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్‌ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని వ్యాఖ్యలు చేశారు.

దీంతో, ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారం చోటుచేసుకుంది. బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మొయిత్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీఎంసీ ఎంపీ మొయిత్రా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు.. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం

మరిన్ని వార్తలు