Mamata Banerjee: అతనలా చేశాడంటే నమ్మలేకపోయా.. వ్యక్తిగతంగా చాలా బాధపడ్డా..

25 Jul, 2022 18:29 IST|Sakshi
మమతా బెనర్జీ

కోల్‌కతా: అవినీతికి పాల్పడే వారు, తప్పులు చేసే వారికి తాను మద్దతుగా నిలువబోనని చెప్పారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎవరైనా తప్పు చేసినట్లు నిరూపితమైతే వాళ్లకి యావజ్జీవ శిక్ష పడినా తానేం అనుకోనని తెలిపారు. అలాంటి వ్యవహారాల్లోకి తన పేరు లాగొద్దని సూచించారు. తాను ప్రభుత్వం నుంచి వచ్చే జీతం కూడా తీసుకోవట్లేదని వెల్లడించారు. మంత్రి అవినీతికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయానని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని మమత పేర్కొన్నారు.

బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన రెండు రోజులకు మమత ఈమేరకు స్పందించారు. ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తప్పులు చేసినవారికి సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇవ్వాలని మమత అన్నారు.  అందరూ సాధువులు అని తాను భావించట్లేదని, కానీ ఇప్పటివరకు తాను తెలిసి ఏ తప్పూ  చేయలేదని పేర్కొన్నారు.

టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. మంత్రికి మరిన్ని అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అరెస్టు అయిన అనంతరం సీఎం మమతా బెనర్జీకి పార్థ చటర్జీ నాలుగుసార్లు ఫోన్ కాల్‌ చేశారని వార్తలొచ్చాయి. టీఎంసీ మాత్రం వీటిని ఖండించింది.
చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్‌.. అర్పితకు కానుకలు!

మరిన్ని వార్తలు