నిరసన గళం: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సచివాలయానికి దీదీ

25 Feb, 2021 15:10 IST|Sakshi

పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ప్రయాణించిన సీఎం

కోల్‌కత: ఆకాశానికి ఎగబాకుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై సచివాలయానికి చేరుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్కూటర్‌ను నడుపగా, మమతా హెల్మెట్‌ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ఫ్లకార్డును మెడలో ధరించారు. ఇప్పుడు మీ నోళ్లలో నానుతున్న అంశం​ఏది అని ప్రశ్నిస్తే..పెట్రోల్ ధరల పెరుగుదల. డీజిల్ ధరల పెరుగుదల.

వంట గ్యాస్ ధరల పెరుగుదల అనే ఉంటుందన్న సమాధానాలు వినిపిస్తాయి అని ఫ్లకార్డులో రాసి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించివచ్చు అని మమతా పేర్కొన్నారు. మోదీ, అమిత్‌ షా..దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిన మోటెరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు.

కాగా గత కొన్ని రోజలుగా  పెట్రోల్‌, డిజిల్‌ ధరలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి.  గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్‌ 90 రూపాయలు దాటేసింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర (రూ .91.12), చెన్నై (రూ .92.90), బెంగళూరు (రూ .93.98), భువనేశ్వర్ (రూ .92), హైదరాబాద్ (రూ. 94.54), జైపూర్ (రూ. 97.34), పాట్నా (రూ. 93.56), తిరువనంతపురం (రూ. 92.81)గా ఉంది.  

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్‌ లీటరు ధర సెంచరీ దాటేసింది. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్‌, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

చదవండి : (పెట్రో సెగలపై ఆర్‌బీఐ సంచలన వ్యాఖ్యలు)
(పెట్రో సెగ: బీజేపీ మంత్రి ఉచిత సలహా)

మరిన్ని వార్తలు