కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

29 Aug, 2022 17:54 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్‌లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను  ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు.

రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్‌ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు.

ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్‌ ప్రభుత్వం రిమిషన్‌ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్‌కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు

మరిన్ని వార్తలు