నన్ను మీ సోదరిలా భావించండి: మమత లేఖ

25 Dec, 2020 20:16 IST|Sakshi

కోల్‌కతా: భారత ప్రముఖ ఆర్థిక నిపుణులు, నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘీభావం ప్రకటించారు. ఓ సోదరిలా ఆయన వెంట ఉంటానని, అంతా కలిసి సమస్యలను అధిగమిద్దామంటూ అండగా నిలిచారు. కాగా చారిత్రక నేపథ్యం గల విశ్వభారతి యూనివర్సిటీ ప్రాంగణంలోని భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఈ అంశంతో అమర్త్యసేన్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ బీజేపీ నేతల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారి తీరు తనను విస్మయానికి గురిచేసిందన్నారు.

ఈ క్రమంలో అమర్త్యసేన్‌కు మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీ శుక్రవారం లేఖ రాశారు. ‘‘శాంతినికేతన్‌ విషయంలో మీరు పేరును లింక్‌ చేస్తూ ఇటీవల పరిణామాల గురించి మీడియాలో వస్తున్న వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. మీ కుటుంబానికి శాంతినికేతన్‌తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. మీ తాతయ్య, ప్రఖ్యాత మేధావి క్షితిమోహన్‌ సేన్‌, మీ నాన్న, ప్రముఖ విద్యావేత్త, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేటర్‌ అశుతోష్‌ సేన్ చేసిన సేవ మరువలేనిది. కానీ కొంతమంది ఇప్పుడు పనిగట్టుకుని మరీ మీ ఆస్తుల గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 

అవి నన్ను బాధిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ధైర్యంగా మీరు మాట్లాడిన మాటలు కొంతమందికి శత్రువును చేశాయి. అయితే ఆ శక్తులపై యుద్ధంలో నేను మీకు తోడుగా ఉంటాను. నన్ను మీ సోదరిలా, ఓ స్నేహితురాలిలా భావించండి. వారి నిరాధార ఆరోపణలు, దాడులను మనం కలిసి అధిగమిద్దాం’’ అని పేర్కొన్నారు.  కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్‌ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ సహా బీజేపీ సీనియర్‌ నేతలు మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. ఆమె దీటుగా బదులిస్తున్నారు.(చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు