ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ..!

9 May, 2021 19:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండగా, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్‌ కొరతపై ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్‌-19 పై చేస్తున్న పోరాటంలో ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులపై పన్నులను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆదివారం రోజున ప్రధాని నరేంద్రమోదీకి లేఖను రాశారు. దాంతో పాటుగా ఆస్పత్రుల్లో  మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని కోరింది. కోవిడ్‌-19 రోగుల వైద్యం కోసం అవసరమయ్యే పరికరాలను, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మ‌మ‌తా బెన‌ర్జీ లేఖలో రాశారు.

పెద్ద ఎత్తున పలు ఎన్జీవోలు, వ్యక్తులు కోవిడ్‌-19 రోగుల కోసం ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేటర్‌, సిలిండ‌ర్లు, క్రయోజనిక్‌ స్టోరేజీ ట్యాంకర్లను, కంటైనర్లను ప్రభుత్వానికి అందించడానికి ముందుకు వస్తున్నారని పేర్కొంది. ఈ సంస్థల నుంచి వస్తోన్న పరికరాలతో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంలా ఉంటాయని మమత లేఖలో తెలిపారు. మెడికల్‌ సదుపాయాలపై పన్నుల నుంచి వెసులుబాటు కల్పించాలని స్వచ్చంద సంస్ధలు తెలిపిన విజ్ఞప్తి మేరకు, మెడికల్‌ వస్తువులపై పన్నులు వేయకుండా మినహాయింపును ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు. పన్నుల చెల్లింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్న నేప‌థ్యంలో రోగుల ప్రాణాల‌ను కాపాడే మందులు. ప‌రికరాలపై పన్నులను ఎత్తివేయాలని కోరారు. దాంతో పాటుగా  దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాలని మమత బెనర్జీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

చదవండి: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మరిన్ని వార్తలు