గుర్తింపునకు నోచని రక్తచరిత్ర.. మాన్‌గఢ్‌ ధామ్‌.. మరో జలియన్‌ వాలాబాగ్‌

2 Nov, 2022 22:29 IST|Sakshi

ఆదివాసీల ప్రాబల్యమున్న మాన్‌గఢ్‌ ప్రాంతమది. బ్రిటిష్‌ పాలనలో రక్తమోడింది. జలియన్‌వాలాబాగ్‌ ఘటనకి ఆరేళ్ల ముందు ఇక్కడ తెల్లదొరలు మారణహోమం సాగించి అక్షరాలా 1500 మంది ఆదివాసీల  ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణానికి చరిత్రలో అంతగా గుర్తింపు లభించలేదు.  ఈ ప్రాంతం రాజస్థాన్‌లోని బన్‌స్వారా జిల్లాలో గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. సంఘ సంస్కర్త గోవింద్‌ గురు 1913లో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉత్తేజపరిచారు.

ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల్ని భిల్‌ అని పిలుస్తాను. వీరు విలువిద్యలో ఆరితేరినవారు. బానిసత్వ వ్యవస్థ, పన్నుల భారాన్ని నిరసిస్తూ గోవింద్‌ గురు ఇచ్చిన పిలుపుతో  గిరిజనులు ఉద్యమించారు. 1913 నవంబర్‌ 17న  బ్రిటీష్‌ సైనికుల విచక్షణారహిత కాల్పుల్లో 1500 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.

ఒక్క దెబ్బకు మూడు రాష్ట్రాలు  
మాన్‌గఢ్‌ ధామ్‌ను నేషనల్‌ మాన్యుమెంట్‌గా ప్రకటించడం వెనుక ఆదివాసీల ఓట్లను ఆకర్షించే రాజకీయం దాగుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గిరిజనులు మాన్‌గఢ్‌ ప్రాంతాన్ని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ రాజకీయ లబ్ధికి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి.  డిసెంబర్లో గుజరాత్, వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీలకు ఎన్నికలున్న నేపథ్యంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలంటూ ప్రధానికి రెండు లేఖలు రాశారు.

ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) నాలుగు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో భిల్‌ ఆదివాసీల ప్రాంతాలతో ప్రత్యేక భిల్‌ ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలని గళమెత్తుతోంది. గుజరాత్‌లో 16, రాజస్థాన్‌లో 10, మధ్యప్రదేశ్‌లో ఏడు, మహారాష్ట్రలో ఆరు జిల్లాలను కలిసి భిల్‌ ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. రాజస్థాన్‌ జనాభాలో గిరిజనులు 13.48%, గుజరాత్‌లో 14.8%, మధ్యప్రదేశ్‌లో 21.1%, మహారాష్ట్రలో 9.35% ఉన్నారు. రాజస్థాన్‌లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భిల్‌ ఆదివాసీలు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలో కాంగ్రెస్‌ 13, బీజేపీ 8, బీటీపీ, స్వతంత్రులు చెరొక స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా 27 సీట్లలో 13 బీటీపీ నెగ్గింది.  

ఇక జాతీయ స్మారక చిహ్నం
మాన్‌గఢ్‌ (రాజస్థాన్‌): మాన్‌గఢ్‌ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా కేంద్రం ప్రకటించింది. మాన్‌గఢ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ‘‘మాన్‌గఢ్‌ ధామ్‌ను మరింతగా విస్తరించడానికి అభివృద్ధి చేయాలని మనందరికీ బలమైన కోరిక ఉంది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకొని ఒక రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయండి’’ అని ప్రధాని అన్నారు. ఈ ధామ్‌ని అభివృద్ధిని చేస్తే కొత్త తరంలో స్ఫూర్తిని నింపిన వాళ్లమవుతామని ప్రధాని వ్యాఖ్యానించారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
చదవండి: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?

మరిన్ని వార్తలు