చెట్టుకి పోస్టర్‌ అంటించిన మావోయిస్టులు.. క్షణం క్షణం భయంగా గడుపుతున్న జనం

27 Oct, 2021 12:50 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): జిల్లాలోని మునిగుడ సమితి, కుముడాబల్లి వంతెన దగ్గరి ఓ చెట్టుకి మావోయిస్టులు ఓ పోస్టరు అతికించారు. నాగావళి–గుముసుర డివిజన్‌ మావోయిస్ట్‌ పార్టీ పేరిట మంగళవారం కనిపించిన ఈ పోస్టరుని చూసి, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టరు నకళ్లు సైతం గ్రామంలోని ఐదు ప్రాంతాల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని మావోయిస్టులు ఆరోపించారు.

కలహండి జిల్లా, గోలముండ పరిధి, మహాలింగ సన్‌షైన్‌ విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌ మమిత మెహర్‌ హత్యకు గురికావడం దారుణమని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మమిత హత్య కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని, శిక్షించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని మావోయిస్టులు పోస్టర్లలో కోరారు. ఇదే విషయంపై స్పందించిన పోలీస్‌ అధికారులు ఇటువంటి గాలి వార్తలకు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు.   

చదవండి: పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి..

మరిన్ని వార్తలు