వీడియో: నడిరోడ్డులో స్కూటీపై స్నానం.. నవ్వులపాలే కాదు జైలుపాలు కూడా!

18 May, 2023 20:58 IST|Sakshi

వైరల్‌ వీడియో: సోషల్‌ మీడియాలో ఓవర్‌నైట్‌ సెలబ్రిటీగా, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయేందుకు కొందరు చేసే ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి, ఓ యువతితో కలిసి స్కూటీపై స్నానం చేసిన వీడియో వైరల్‌ కాగా, దానికి పోలీసులు అంతే లెవల్‌లో రిప్లై ఇచ్చారు. 

థానే(మహారాష్ట్ర) ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్‌ వద్ద ఆ ఇద్దరూ ఈ చేష్టలకు దిగారు. వెనక కూర్చున్న యువతి బకెట్‌లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తూ కనిపించింది. దారినపోయేవాళ్లంతా వాళ్ల వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అయితే.. ఆ వీడియో వైరల్‌ కావడం, అది కాస్త థానే పోలీసుల దాకా చేరడం, వాళ్లూ స్పందించడం చకచకా జరిగిపోయాయి. 

వీ డిజర్వ్‌ బెటర్‌ గవర్నమెంట్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు.. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆ వీడియోను షేర్‌ చేసి మరీ చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు సైతం అతనిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. 

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్‌ ఆదర్శ్‌ శుక్లా అట. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌చేశాడతను. అయినా కూడా చర్యలు తప్పవని థానే పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు