ఏ పని చేయడం లేదని భార్య నిలదీయడంతో.. పోలీస్‌ అవతారం!

6 Aug, 2021 08:13 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆయనో నకిలీ పోలీస్‌ కమిషనర్‌. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్‌ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం.. చెన్నైకి చెందిన విజయన్‌ (42)కు లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో అతని భార్య ఏ పనీచేయకుండా ఉంటే ఎలా అని నిలదీస్తూ ఉండడంతో గెటప్‌ మార్చాడు. గ్రూప్‌–1 పాసై, డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్‌ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందినట్లు నమ్మబలికాడు.

ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్‌ కొనుగోలు చేసి సైరన్‌తో కూడిన పోలీస్‌ వాహనంగా మార్చాడు. కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. పోలీస్‌ అధికారి అవతారమెత్తాక పలువురి వద్ద డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్‌ కమిషనర్‌ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద అతని బండారం బట్టబయలైంది. వాహనాల తనిఖీలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ముచ్చట్లాడుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం!  అయితే తాను ఒక ప్రైవేట్‌ న్యూస్‌ చానల్‌లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. మరోవైపు– ఈ కేసు విచారణ సమయంలో పలువురు ఫోన్‌ ద్వారా ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు చెప్పడం గమనించతగ్గ అంశం. ప్రముఖుల పేర్లను, ఫొటోలను విజయన్‌ వాడుకున్నాడా? ఇతడిని అడ్డుపెట్టుకుని ప్రముఖులు సొమ్ము చేసుకున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం విచారించనున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు