Buffalo Refusing To Be Milked: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత

14 Nov, 2021 18:30 IST|Sakshi

భోపాల్‌: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని కామెడీ సనిమాల్లో మా ఇల్లు తప్పిపోయిందని, ఓ చిన్న పిల్లాడు తన పెన్సిల్‌ దారిపోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సన్నివేశాలను మనం చూసుంటాం. ఈ తరహాలోనే తాజాగా ఓ వ్యక్తి తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాబూలాల్ జాతవ్ (45) అనే గ్రామస్థుడు శనివారం నయాగావ్ పోలీస్ స్టేషన్‌కు తన గేదెను తీసుకెళ్లాడు.

పోలీసులతో తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని, పాలు కూడా తనని పితకనివ్వడం లేదని తెలిపాడు. తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తోందని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ తన గేదెతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు.

తన గేదె పాలు ఇచ్చేలా తనకు సహాయం చేయాలని కోరాడు. దీంతో పోలీసులకు అతనికి ఒక పశువైద్యుడి వద్దకు ఆ గేదెను పంపారు. చివరకు తన గేదె పాలు ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి అతను ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనని వారికి థాంక్స్‌ చెప్తున్నారు.

చదవండి: వైరల్‌: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్‌.. సరిపోయిందా.. ఇంకా కావాలా?

మరిన్ని వార్తలు