Maharashtra: తీరని విషాదంలో పెద్దాయన, ఎంత కష్టం!

9 Sep, 2021 10:14 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో రహదారులు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హృదయ విదారకమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను  ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేక ఓ పెద్దాయన అల్లాడి పోయాడు. చివరకు తన భుజాలమోసుకొని  తీసుకుపోదామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  దీంతో  65 ఏళ్ల  వృద్ధుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే నందూర్‌బార్ అటవీప్రాంతంలో ఉన్న చంద సాయిలి గ్రామంలో నివసిస్తున్న  సిధాలిబాయి పద్వి (60) అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో బుధవారం తీవ్ర కడుపు నొప్పి ఆమెను వేధించింది. దీంతో ఆమె భర్త  ఆడ్ల్య పాడ్వి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. కానీ వర్షాల కారణంగా  అది మూసి ఉంది. ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 

మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు మూతపడ్డాయి. ఇక వేరే మార్గం లేక కొండ మార్గంలో రాజధాని ముంబై నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడానికి పాదరక్షలు లేకుండా తన భుజాలపై ఎత్తుకుని ఆమెను తీసుకెళుతున్నాడు. కానీ మధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. నిస్సహాయుడైన భర్త గుండె పగిలి రోదిస్తున్న తీరు స్థానికులను కదిలింది. సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోవడంతో వృద్ధుడి భుజాలపైనే ఆమె కన్నుమూసిందని  సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ సంఘటన తర్వాత, జిల్లా పరిపాలన అధికారులు, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియల శిథిలాలను రోడ్డుపై నుండి తొలగించే చర్యలు చేపట్టారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.

మరిన్ని వార్తలు