జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...

11 Jun, 2021 15:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న పోస్ట్‌

వివాహా ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు పెద్దవారు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ముఖ్యంగా ఆడపిల్లను పంపే ఇంటి వారు కాస్త స్థితిమంతులు అయితే బాగుండు అనుకుంటారు. అందుకే తమ స్తోమతకు మించి.. అప్పు చేసి మరి మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్న కుటుంబానికి ఆడపిల్లను వివాహం చేసి పంపిస్తారు. ఇలా తేలుసుకోవడం మంచిదే. అయితే దేని గురించి అయిన అడగడానికి ఓ పద్దతి ఉంటుంది. కాదని హద్దు మీరి ప్రవర్తిస్తే.. అసలుకే మోసం వస్తుంది. 

తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాబోయే అల్లుడి జీతం ఎంతో తెలుసుకోవడం కోసం.. ఓ అత్తమామ.. అతడి దగ్గర నుంచి మొబైల్‌ లాక్కుని.. ఓ గదిలో బంధించి టార్చర్‌ పెట్టారట. ఆగ్రహించిన సదరు వ్యక్తి  వివాహం క్యాన్సిల్‌ చేద్దామనుకున్నాడట. కానీ చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. రెడిట్‌లో పోస్ట్‌ చేసిన ఈ కథనం వివరాలు.. 

ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ఏంటి అనే వివరాలు లేవు. కానీ పోస్ట్‌ ప్రకారం.. ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం పెళ్లి కుదిరింది.ఆ తర్వాత అతడి కొత్తగా జాబ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి కాబోయే అత్తమామ అల్లుడికి ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని భావించారు. అతడిని పిలిచి ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్నారు. ఓ రోజు అతడికి కాల్‌ చేసి ఇంటికి  రమ్మన్నారు. బాధితుడు ఇంటికి వెళ్లే సరికే అతడి కాబోయే భార్య ఇంట్లో లేదు.. అత్త, మామ మాత్రమే ఉ‍న్నారు. గెస్ట్‌ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అతడి దగ్గర నుంచి మొబైల్‌ ఫోన్‌, బైక్‌ కీ తీసుకుని దాచిపెట్టారు. ఆ తర్వాత అతడి గొత్త ఉద్యోగం గురించి చర్చించసాగారు. 

బాధితుడు మాట్లాడుతూ.. ‘‘నా కాబోయే మావ కొత్త ఉద్యోగంలో జీతం ఎంత వస్తుందని ప్రశ్నించారు. నాకు చెప్పడం ఇష్టం లేక దాటవేసే ప్రయత్నం చేశాను. కానీ వారు ‘‘నీకు మా కుమార్తెను ఇస్తున్నాను.. నీ సంపాదన ఎంతో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. కచ్చితంగా చెప్పి తీరాల్సిందే’’ అని డిమాండ్‌ చేయసాగారు. నేను బాగానే సంపాదిస్తున్నాను.. మీ కుమార్తెను బాగా చూసుకుంటాను అని వారికి హామీ ఇచ్చాను. కానీ వారు నా మాట వినలేదు. నా అత్త ‘‘డబ్బులు చాలా ముఖ్యం. నువ్వు కుటుంబాన్ని పోషించగలవో లేదో తెలియాలి కదా.. ఎంత సంపాదిస్తున్నావో చెప్పాల్సిందే’’ అని డిమాండ్‌ చేశారు’’ అని తెలిపాడు. 

‘‘వాళ్లు ఎంతకి ఆ టాపిక్‌ మార్చకపోవడంతో నేను అక్కడి నుంచి బయటకు వెళ్లిపోదామని భావించాను. బాత్రూంకి వెళ్తాను అని చెప్పి.. బయటకు వెళ్లే ప్రయత్నం చేశాను. నేను లేవగానే నా కాబోయే అత్త గారు నన్ను బంధించమని గట్టిగా అరిచారు. ఇక మావ నన్ను గదిలో పెట్టి లాక్‌ చేశారు. మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశాను. ఇంతలో నా కాబోయే భార్య వచ్చింది. ఇది గమనించి ఆమె తల్లిదండ్రులు డోర్‌ తెరిచి ఏడ్వడం ప్రారంభించారు. ఇక నా ఫియాన్సీ జరిగిన విషయం ఏంటో తెలియకుండా.. నేను తన తల్లిదండ్రులను అవమానించి తనను కూడా బాధపెట్టానని ఆరోపించిది. వారికి క్షమాపణలు చెప్పమని కోరింది’’ అన్నాడు. 

‘‘వారి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి కుటుంబానికి అల్లుడిని అయితే ఇక నా జీవితం ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేసింది. కానీ నా తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే నా భార్య చాలా మంచిది. తను నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇక అత్తమామల వల్ల ఇప్పటికి అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి’’ అని తెలిపాడు. 

చదవండి: 
కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!
షాకింగ్‌: భార్య ప్రేమను అ‍మ్మకానికి పెట్టి మరీ..

మరిన్ని వార్తలు