‘హథ్రాస్‌ బాధితురాలిగా నా భార్య ఫోటో’

16 Oct, 2020 09:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ ఉదంతంలో బాధితురాలి ఫోటో అంటూ చనిపోయిన తన భార్య ఫోటోను వాడుతున్నారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా ఢిల్లీ​ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ నవీన్‌ చావ్లా మాట్లాడుతూ.. ‘సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమని తేలితే.. ప్రభుత్వం ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఆదేశాలు జారీ చేయడమే కాక వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిటిషన్‌దారు సమర్పించిన దృష్ట్యా మొదటి ప్రతివాదిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ సదరు వ్యక్తి ఫిర్యాదుని పరిశీలించాలి. ఒకవేళ నిజమని తేలితే దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి. ఈ ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని తెలిపారు. ఇక ఈ ఫిర్యాదుకు సంబంధించి కోర్టు అక్టోబర్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వాళ్లందరికీ భద్రత కల్పిస్తున్నాం..)

అంతేకాక సదరు వ్యక్తిని ఈ ఉత్తర్వు కాపీతో పాటు తన ఫిర్యాదుకు మద్దతుగా ఉన్న అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖకు పంపాలని కోర్టు సూచించింది. తప్పుడు కంటెంట్‌ ఉన్న యూఆర్‌ఎల్‌ని గుర్తించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌, గూగుల్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఒక యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన ఘటనలో బాధితురాలిగా.. చనిపోయిన తన భార్య ఫోటోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఇక అతడి న్యాయవాది అత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం అని.. పైగా ప్రస్తుతం తప్పుడు ఫోటో ప్రచారం అవుతుందని కోర్టుకు విన్నవించాడు. (చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే)

ఇక ట్విట్టర్‌ తరపు న్యాయవాది ఈ వ్యక్తి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపాడు. కోర్టు ఉత్తర్వులను సూచించే సరైన ఛానెల్ ద్వారా తప్పుడు ఫోటో షేర్‌ అవుతున్న యూఆర్‌ఎల్‌కు సంబంధించిన సమాచారం తమకు పంపితే వాటిని తొలగిస్తామని తెలిపాడు. గూగుల్‌ కూడా ఇదే తెలిపింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా