తల్లిదండ్రులిద్దరికి వ్యాక్సిన్‌.. షాకైన కుమారుడు

24 May, 2021 16:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం

చనిపోయిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్ల మెసేజ్‌

జైపూర్‌: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక విధి నిర్వహణలో అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అందరికి తెలుసు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్‌లో వెలుగు చూసింది. దాదాపు ఏడేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి తల్లిదండ్రులకు కోవిడ్‌ టీకా ఇచ్చినట్లు అతడి మొబైల్‌కి మెసేజ్‌ రావడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వివరాలు.. 

పర్వీన్‌ గాంధీ రాజస్తాన్‌ దుంగర్‌పూర్‌ జిల్లాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2014లో అతడి తండ్రి మరణించగా.. మరుసటి ఏడాది అనగా 2015లో అతడి తల్లి మరణించింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం పర్వీన్‌ గాంధీ మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. పర్వీన్‌ గాంధీ తల్లిదండ్రులిద్దరికి శ్రీ గంగానగర్ జిల్లాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మొదటి డోస్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ఆ మెసేజ్‌లో ఉంది. దాన్ని చూసి పర్వీన్‌ గాంధీ షాక్‌ అయ్యాడు. ఎప్పుడో చనిపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు వ్యాక్సిన్‌ ఇవ్వడం ఏంటనుకున్నాడు. 

దీని గురించి పర్వీన్‌ గాంధీ ఆరా తీయగా.. శ్రీ గంగానగర్‌లోని 1కేడీ గ్రామంలో ఎవరో తన తల్లిదండ్రుల పత్రాలపై టీకాలు తీసుకున్నట్లు తెలిసింది. మరణించిన తన తల్లిదండ్రుల పత్రాలను టీకాల కోసం మోసపూరితంగా ఉపయోగించినట్లు జిల్లాలోని ఇద్దరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని పర్వీన్‌ గాంధీ తెలిపాడు. ‘‘మాస్క్‌ ధరించడం వల్ల డాక్యుమెంట్లలో ఉన్న వారు.. టీకా తీసుకోవడానికి వచ్చిన వారు వేరు వేరు అని గుర్తించడం వీలు కావడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో పర్వీన్‌ గాంధీ తల్లీదండ్రుల  పత్రాల మీద టీకా తీసుకుని ఉంటారని’’ అధికారులు తెలిపారు.  

చదవండి: కోవిడ్‌ వ్యక్తి అంతిమయాత్రకు హాజరు, 21 మంది మృతి..!

మరిన్ని వార్తలు