‘ఏక్‌నాథ్‌ షిండేను లేపేస్తా’.. మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు కాల్‌.. ఇది కొత్తేమీ కాదు! 

12 Apr, 2023 09:48 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు బెదిరింపు ఫోన్‌ చేసిన వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆగంతకుడు మద్యం మత్తులో ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఆగంతకున్ని మంగళవారం అదుపులోకి తీసుకుని జైలులో వేశారు. సోమవారం సాయంత్రం అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబరు 112కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది.

అందులో నేను ‘ఏక్‌నాథ్‌ షిండేను లేపేస్తా’ అంటూ కేవలం ఒకే మాట మాట్లాడి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరాతీశారు. ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన రాజేశ్‌ ఆగవ్‌ణే అనే యువకుడి నుంచి ఫోన్‌ వచ్చినట్లు గుర్తించారు. కానీ ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన ఓ బృందం అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో రాజేశ్‌ లేడు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లోకేషన్‌ను ట్రేస్‌ చేయగా పుణేలోని వారజే పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పుణే పోలీసులు, నాగ్‌పూర్‌ ఏటీఎస్‌ బృందం అక్కడికి వెళ్లి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

ఇది కొత్తేమీ కాదు..! 
మహారాష్ట్రలో బెదిరింపు ఫోన్లు రావడం కొత్తేమీ కాదు. ఇలాగే తరుచూ అనేక మంది మంత్రులకు, రాజకీయ నాయకులకు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇంటి ముందు బాంబు పెట్టామని, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి మూడుసార్లు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌కు, మాజీ సీఎం అశోక్‌ చవాన్, మాజీ మంత్రులు జితేంద్ర అవ్హాడ్, సంజయ్‌రౌత్, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ తదితర ప్రముఖులకు బెదిరింపు ఫోన్లు రావడం కలకలం రేపుతోంది. తాజాగా సీఎం షిందేకు బెదిరింపు ఫోన్‌ రావడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. 

మరిన్ని వార్తలు