ఢిల్లీ ట్రాక్టర్‌ ర్యాలీలో నేలకొరిగిన రైతుబిడ్డ

28 Jan, 2021 00:55 IST|Sakshi

రాంపూర్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొని మృత్యువాత పడిన నవ్‌రీత్‌ సింగ్‌ గ్రామంలో విషాదం అలుముకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో పెళ్ళి చేసుకున్న 27 ఏళ్ళ నవ్‌రీత్‌ సింగ్,  తన సొంత గడ్డపై పెళ్ళి వేడుకని జరుపుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి ఉత్తరప్రదేశ్, బిలాస్‌పూర్‌లోని తన స్వగ్రామమైన డిబ్డిబాకి వచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా తన సమీప బంధువులతో కలిసి ట్రాక్టర్‌ ర్యాలీకి హాజరయ్యారు. రైతుల ట్రాక్టర్‌ పెరేడ్‌ సందర్భంగా సెంట్రల్‌ ఢిల్లీలోని ఐటీఓ వద్ద పోలీసు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ట్రాక్టర్‌కింద పడి నవ్‌రీత్‌ సింగ్‌ మరణించారని పోలీసులు చెప్పారు.

పోలీసు కాల్పుల్లో నవ్‌రీత్‌ మరణించాడన్న పుకార్లు వచ్చాయని, అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో ఏ కాల్పులూ రికార్డు కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం నవ్‌రీత్‌ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామానికి చేర్చారు. ఆయన పెళ్ళి వేడుకకు ఒక రోజు ముందు నవ్‌రీత్‌ సింగ్‌ మృత్యువాత పడడం అందర్నీ విషాదంలో ముంచింది. నవ్‌రీత్‌ గ్రామంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నవ్‌రీత్‌ సింగ్‌ని అమరవీరుడిగా పేర్కొన్న అతని కుటుంబ సభ్యులు నవ్‌రీత్‌ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళి, ఇటీవలే అక్కడ వివాహం చేసుకున్నారని చెప్పారు. 

ఈ ఘటన జరిగిన తరువాత రైతులు నవ్‌రీత్‌ సింగ్‌ భౌతిక కాయంపై త్రివర్ణపతాకాన్ని కప్పి ఢిల్లీలోని ఐటివో క్రాస్‌రోడ్‌లో ఉంచి ఆందోళనకు దిగారు. వేగంగా దూసుకు రావడం తోనే ట్రాక్టర్‌పైనుంచి కిందపడి నవ్‌రీత్‌ మరణించాడని పోలీసులు చెపుతుండగా, రైతులు మాత్రం పోలీసుల వాదనను ఖండించారు. నవ్‌రీత్‌ పోలీసు కాల్పుల్లోనే మరణించినట్టు స్పష్టం చేశారు. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించగా, అది నవ్‌నీత్‌ తలపై పడి మరణించాడని ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు