పాన్‌ షాప్‌ యజమాని కుమారుడు దారుణహత్య

17 Feb, 2021 18:09 IST|Sakshi

అప్పుగా ఇవ్వలేదని గొడవ.. బిహార్‌లో ఘటన

పాట్నా: పాన్‌ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి పాన్‌ మసాలా (గుట్కా) అప్పుగా ఇవ్వాలని కోరగా దుకాణ యజమాని నిరాకరించాడు. దీంతో దుకాణ యజమానితో అతడు గొడవ పడ్డాడు. అప్పుగా పాన్‌ మసాలా ఇవ్వకపోవడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ సందర్భంగా అదే కోపంతో తెల్లారి వచ్చి ఆ దుకాణంపై దాడి చేశాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో త్రివేణిగంజ్‌కు చెందిన అజిత్‌కుమార్‌ రౌడీ. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ పాన్‌ షాప్‌కు వచ్చాడు. బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 విలువ చేసే పాన్‌ మసాలా అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అయితే దుకాణంలో ఉన్న యజమాని ఇవ్వను అని తేల్చిచెప్పాడు. కొద్దిసేపు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడితో వాగ్వాదం చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు సర్ది చెప్పడంతో అజిత్‌ వెళ్లిపోయాడు.

అయితే మరుసటి రోజు సోమవారం తన అనుచరులతో దుకాణం వచ్చాడు. దుకాణంలో ఉన్న యజమాని చిన్న కుమారుడు మిథిలేశ్‌తో మళ్లీ పాన్‌ మసాలా కోసం గొడవ పడ్డాడు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన అజిత్‌ కుమార్‌ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన మిథిలేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి సమీపంలో ఉన్న మిథిలేశ్‌ అన్న పరుగెత్తుకుంటూ రావడంతో త్రివేణి సింగ్‌, అతడి అనుచరులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను తాము గుర్తించినట్లు.. త్వరలోనే వారిని పట్టుకుంటామని సుపాల్‌ జిల్లా పోలీస్‌ అధికారి షేక్‌ హసన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు