నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు

13 Jul, 2022 17:55 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రాజు దయమా అనే వ్యక్తి ప్రజలను బెదిరిస్తూ..హింసిస్తున్నందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే...రాజు మానస తహసీల్‌లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అతను తాను ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తన డబ్బులు తనకిచ్చేయమంటూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టాడు.

రాజు ప్రజలను బెదరించడమే కాకుండా హింసించడం వంటి పనులు కూడా చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది.  రాజు పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తన వద్ద తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాల్సిందే.. అంటూ ప్రజల వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రాజు, అతని సహచరుడి పై ఎన్నికల్లో డబ్బు పంచినందుకు, ప్రజలను డబ్బు ఇచ్చేయమంటూ.. ఇబ్బందిపెట్టినందుకుగానూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

(చదవండి: లాలూ యాదవ్‌ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు)

మరిన్ని వార్తలు