Man Receives Bra Instead Football Socks: ఆన్‌లైన్‌లో సాక్సులు ఆర్డర్‌ చేస్తే లోదుస్తులు.. ఇదేంటని అడిగితే షాకింగ్‌ రిప్లై

19 Oct, 2021 19:43 IST|Sakshi

ముంబై: ఉరుకులు పరుగుల జీవితంలో మనకు కావాల్సిన అన్ని వస్తువులు మార్కెట్‌కు వెళ్లి కొనుక్కోలేం. ఇదే పెట్టుబడిగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలు పుట్టకొచ్చాయి. చాలా సంస్థలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే, కొన్ని పొరపాట్ల వల్ల ఆర్డర్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూసే కస్టమర్లకు షాకులు కూడా తగులుతుంటాయి. 

ఒక వస్తువు ఆర్డర్‌ చేస్తే మరొకటి రావడం, లేదంటే పాడైన వస్తువు డెలివరీ కావడం చూస్తుంటాం. తాజాగా ముంబైకి చెందిన కశ్యప్‌ అనే వ్యక్తికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మింత్రా యాప్‌లో ఫుట్‌బాల్‌ సాక్సులు ఆర్డర్‌ చేస్తే.. అతని ఇంటికి లేడిస్‌ లోదుస్తులు వచ్చాయి. కంగుతిన్న కశ్యప్‌ ఇదేంటని ప్రశ్నించి, రిఫండ్‌ కోసం ప్రయత్నిస్తే.. ‘ప్రొడక్టు తిరిగి స్వీకరించబడదు’ అనే రిప్లై వచ్చింది. 
(చదవండి: Viral Video: కదులుతున్న రైలు నుంచి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. క్షణం ఆలస్యమయ్యుంటే.)

చేసేదేం లేక పాపం అతను తన బాధను ట్విటర్‌లో వెళ్లగక్కాడు. లోదుస్తులు ధరించి ఫుట్‌ బాల్‌ ఆడతాలే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకే​ముంది.. ‘తప్పు జరిగిపోయింది. సారీ. అతి త్వరలో మీ సమస్య పరిష్కరస్తాం’ అంటూ ట్విటర్‌లో మింత్రా యాజమాన్యం రిప్లై ఇచ్చింది. 

ఇక ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అందుకేనా ఆన్‌లైన్‌ యాప్‌లు ట్యాంపర్‌ ప్రూఫ్‌గా వస్తువులను డెలివరీ చేస్తుంటాయి అని కొందరు కామెంట్లు చేస్తే.. లో దుస్తులకు బదులు సాక్సులు అందుకున్న ఆ మహిళ పరిస్థితి ఏంటో? మరికొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. సదరు మహిళకు కూడా క్షమాపణలు చెప్పి.. ఆమె సమస్య కూడా పరిష్కరించాలని నెటిజన్లు కోరుతున్నారు.
(చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!)

మరిన్ని వార్తలు