ఉత్తర ప్రదేశ్‌లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్‌ షాక్‌, లాఠీ దెబ్బలు

5 Jun, 2022 20:10 IST|Sakshi

లక్నో: పశువులను దొంగిలించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు చితకబాదారు. నేరం ఒప్పుకోవాలంటూ యువకుడిని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో నొప్పులు తాళలేక ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పశువులను దొంగిలించాడనే కోసులో బడాయున్ పోలీసులు రెహాన్ అనే 20 ఏళ్ల యువకుడిని  అరెస్టు చేశారు. దినసరి కూలీ అయిన రెహాన్‌ను మే 2న పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ క్రమంలో స్టేషన్ అధికారి, మిగతా పోలీసులు అతన్ని వేధింపులకు గురిచేశారు. 

కస్టడీలో లాఠీలతో కొట్టడం, కరెంట్‌ షాక్‌ ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు దెబ్బలతో ఒళ్లంతా పుండు అయిపోయింది. అంతటితో ఆగకుండాప్రేవేటు భాగాల్లో గాయాలయ్యేలా కొట్టారు. అయితే  ఇదంతా బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు  వెలుగులోనికి వచ్చింది. అయితే రెహాన్‌ను విడిచిపెట్టాలంటే పోలీసులు రూ.5 వేలు డిమాండ్‌ చేశారని, డబ్బులు ఇస్తేనే స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేగాక రూ. 100 ఇచ్చి చికిత్స చేసుకోవాలని చెప్పి అవమానపరిచారని పేర్కొన్నారు. 

చేసేదేం లేక అడిగినంత డబ్బులు ఇచ్చి తమ కొడుకుని ఇంటికి తీసుకొచ్చామని రెహాన్‌ తల్లిదండ్రులు వాపోయారు. రెహాన్‌ను తీవ్రంగా గాయపరిచారని, నడవలేక, మాట్లాడలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  అనంతరం ఈ దారుణం గురించి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో  ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు స్టేషన్‌ ఇంచార్జితో సహా అయిదుగురు పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి విచారణ చేపట్టారు.  ఇప్పటి వరకు నలుగురిని సస్పెండ్ చేశారు. కాగా రెహాన్ ప్రస్తుతం బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్‌ శర్మ

మరిన్ని వార్తలు