చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు నమూనాలు

22 Dec, 2022 16:22 IST|Sakshi

గాంధీనగర్‌: చైనాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 విజృంభణపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే, మూడు రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్తకు పాజిటివ్‌గా తేలగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. అతడి నమూనాలను గాంధీనగర్‌లోని పరిశోధన కేంద్రానికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. 

భావ్‌నగర్‌కు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ తన వ్యాపార నిమిత్తం ఇటీవలే చైనాకు వెళ్లారు. డిసెంబర్‌ 19 భారత్‌కు తిరిగివచ్చారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ ఆదేశించారు. దీంతో భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది.

చైనాతో పాటు విదేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని రెండ్రోజుల క్రితం లేఖ రాశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవియా. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించటం, శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలన్నారు.

ఇదీ చదవండి: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!

మరిన్ని వార్తలు