రూ. 20లు అధికంగా వసూలు చేశాడంటూ...22 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు

13 Aug, 2022 20:37 IST|Sakshi

మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ.  ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్‌ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు.

ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్‌ వ్యక్తి తుంగనాథ్‌ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్‌లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్‌ ధర రూ.70 కాగా టిక్కెట్‌ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్‌ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్‌ మాస్టర్‌ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది.

ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు.

(చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్‌లో రివైంజ్‌ తీర్చుకున్న భార్య)

మరిన్ని వార్తలు