Mangalore Auto Rickshaw Blast: డైరెక్ట్‌గా అక్కడి నుంచే ఉగ్ర లింకులు.. మరికొందరికి షరీఖ్ బ్రెయిన్‌వాష్‌‌!!

21 Nov, 2022 16:54 IST|Sakshi

బెంగళూరు: శనివారం సాయంత్రం మంగళూరు మైసూర్‌ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ  ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్ణాటక పోలీస్‌ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మొహమ్మద్‌ షరీఖ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు.

కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం..  శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్‌.. ఆటోలో డిటోనేటర్‌ ఫిక్స్‌ చేసిన ప్రెషర్‌కుక్కర్‌ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు షరీఖ్‌ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇక ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన కర్ణాటక పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్‌ యత్నించినట్లు భావిస్తున్నామని అదనపు డీజీపీ అలోక్‌ తెలిపారు.

24 ఏళ్ల వయసున్న షరీఖ్‌పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని శాంతి భద్రతల అదనపు డీజీపీ అలోక్‌ కుమార్‌ సోమవారం వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.  బెంగళూరు సుద్ధాగుంటెపాళ్యాకు చెందిన అబ్దుల్‌ మాటీన్ తాహా‌.. షరీఖ్‌కు గతంలో శిక్షకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు అతనిపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఐదు లక్షల రివార్డు ప్రకటించింది అని అడిషినల్‌ డీజీపీ వెల్లడించారు. 

అతను(షరీఖ్‌) ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, తద్వారా అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. సుమారు 45 శాతం కాలిన గాయాలతో.. మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు.  ఇక.. మైసూర్‌లో షరీఖ్‌ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్‌, సల్ఫర్‌, గీతలు, నట్లు-బోలట్లు లభించాయి. ఆ ఇంటి ఓనర్‌ మోహన్‌ కుమార్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్‌ రాజ్‌ అనే పేరుతో ఫేక్‌ ఆధార్‌కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని, ఇంట్లోనే ప్రెషర్‌ కుక్కర్‌ బాంబ్‌ తయారుచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరు, శివమొగ్గ, మైసూర్‌, తీర్థహల్లితో పాటు మరో మూడు చోట్ల ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. 


మరికొందరికి బ్రెయిన్‌వాష్‌..?
ఇదిలా ఉంటే 24 ఏళ్ల షరీఖ్‌.. ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు గానూ UAPA కింద అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. మంగళూరులో గతంలో మత సంబంధిత అభ్యంతరకర రాతలు, బొమ్మలు గీసి.. జైలుకు వెళ్లి బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. శివమొగ్గలో పంద్రాగష్టున జరిగిన మత ఘర్షణల్లోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఒకతన్ని కత్తితో పొడిచిన కేసులో సహ నిందితుడిగా ఉండడమే కాదు.. ఆ కేసులో పరారీ నిందితుడిగా ఉన్నాడు షరీఖ్‌. 

ఈ కేసులో అరెస్ట్‌ అయిన యాసిన్‌, ఆమాజ్‌లు..  షరీఖ్‌ తమకు బ్రెయిన్‌వాష్‌ చేశాడని వెల్లడించారు. అంతేకాదు.. అతనికి సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ కోసం ఇక్కడా షరీఖ్‌ పని చేశాడని వాంగ్మూలం ఇచ్చారు.  బ్రిటిష్‌ వాళ్ల నుంచి భారత్‌కు సిద్ధించింది నిజమైన స్వాతంత్రం కాదని..ఇస్లాం రాజ్య స్థాపనతోనే అది పూర్తవుతుందని ఇతరులకు షరీఖ్‌ బోధించేవాడని పోలీసులు వెల్లడించారు.   

సిరియాకు చెందిన ఆ మిలిటెంట్ సంస్థ నుంచి ఓ మెసేజింగ్‌ యాప్‌ ద్వారా సందేశం అందుకున్న షరీఖ్‌.. అందులోని పీడీఎఫ్‌ ఫార్మట్‌ డాక్యుమెంట్‌ ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడని కర్ణాటక పోలీసులు ట్రేస్‌ చేయగలిగారు. అంతేకాదు తుంగ నది తీరాన బాంబు పేలుడు తీవ్రతను తెలుసుకునేందుకు.. ట్రయల్‌ను సైతం నిర్వహించారని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు