మోదీ, షా, నడ్డా సమక్షంలో.. త్రిపుర సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణం

8 Mar, 2023 11:36 IST|Sakshi

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్‌లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, మాణిక్‌ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. 

కిందటి ఏడాది.. విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్‌ సాహాను తెర మీదకు తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్‌ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య  ఆయన పని చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్‌ పార్టీతోనే. 2016లో ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరారు. గతంలో.. త్రిపుర క్రికెట్‌ అసోషియేషన్‌కు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు.

సాహా డెంటల్‌ డాక్టర్‌. రాజకీయాల్లోకి రాకమునుపు.. హపానియాలోని త్రిపుర మెడికల్‌ కాలేజీలో పాఠాలు చెప్పారు కూడా.  ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

ప్రధాన నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 'ఉన్నత త్రిపుర', 'శ్రేష్ట త్రిపుర' నిర్మించేందుకు అన్ని సంక్షేమ వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తాం అని మాణిక్‌ సాహా పేర్కొన్నారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అధికారం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో తిప్ర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(మార్క్సిస్ట్‌) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ మూడు సీట్లు గెలుచుకుంది. ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. 

(చదవండి: బైక్‌ ట్యాక్సీ నడుపుతున్న విదేశీయుడు.. ఆటో డ్రైవర్‌ సీరియస్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు