అజర్‌బైజాన్‌లో తప్పిపోయిన భారత యువకుడు

26 May, 2022 20:22 IST|Sakshi
మణికాంత్ కొండవీటి

ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు

సాయం చేయాలని సోదరుడి వేడుకోలు

ఒంటరిగా సాహసయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన భారతీయ యువకుడి కోసం అతడి కుటుంబం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అతడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోంది. మణికాంత్ కొండవీటి (28) అనే యువకుడు ఏప్రిల్ 26న ఇండియా నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాడు. తర్వాత నుంచి అతడు జాడ లేకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతడి జాడ కనిపెట్టేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాము చేస్తున్న ప్రయత్నాల గురించి మణికాంత్ సోదరుడు ధరన్.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తమ సోదరుడి ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఫోటోలో మీరు చూస్తున్న అబ్బాయి నా సోదరుడు మణికాంత్. గత రెండు వారాల నుంచి అతడు కనిపించడం లేదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడంతో మా కుటుంబ సభ్యులంతా నిద్రాహారాలకు దూరమయ్యారు. 


మణికాంత్ నాకు సోదరుడు మాత్రమే కాదు ఆత్మీయ మిత్రుడు. అతడికి సాహస యాత్రలంటే చాలా ఇష్టం. ఒంటరిగా అజర్‌బైజాన్‌కు వెళ్లాలని నాకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ప్రయాణానికి ఒకరోజు ముందు ఢిల్లీలో ఉంటున్న నా దగ్గరకు వచ్చాడు. తర్వాత రోజు స్వయంగా నేను నా సోదరుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేశాను. మళ్లీ వెళ్లినప్పుడు నేను కూడా వస్తానని చెప్పాను. 


ఏప్రిల్‌ 26న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు మాతో టచ్‌లో ఉన్నాడు. అదే రోజు రాత్రి 7 గంటలకు చివరిసారిగా మాట్లాడా. నేను తర్వాత మెసేజ్ చేశాను కానీ అది డెలివరీ కాలేదు. దీంతో కాస్త భయపడ్డాను. బహుశా అక్కడ నెట్‌వర్క్ లేదేమో అనుకున్నాను. తర్వాత అతడిని కాంటాక్ట్‌ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏం చేయాలో తెలియక అజర్‌బైజాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాం. కొండ ప్రాంతంలో ఉండి ఉంటాడని, అందువల్ల సిగ్నల్‌ సమస్య ఉండొచ్చని దౌత్య అధికారులు తెలిపారు. మేము పలుమార్లు ప్రాధేయపడటంతో మణికాంత్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. 


మణికాంత్ జాడ కనిపెట్టడానికి ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు అందరినీ సంప్రదించాం. అతడి ఫొటోలను కూడా సర్క్యులేట్‌ చేశాం. అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమ్మ తన ఫోన్ మోగినప్పుడల్లా మణికాంతే  అనుకుంటుంది. నా సోదరుడి ఫోన్‌ కాల్‌ కోసం ప్రార్థిస్తున్నాను. మణికాంత్ క్షేమంగా తిరిగి వస్తాడని గట్టిగా నమ్ముతున్నామ’ని ధరన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలబడాలని అందరినీ అభ్యర్థించాడు. change.orgలో తాము చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతు పలకాలని కోరారు.

మరిన్ని వార్తలు