మణిపూర్-మయన్మార్ సరిహద్దులో 70 కి.మీ. మేర ప్రహారీ

24 Sep, 2023 19:26 IST|Sakshi

ఇంఫాల్: మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్. బైరెన్ సింగ్  సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.   

అత్యంత అవసరం.. 
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రాన్ని కోరగా 60 కి.మీ. వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం బైరెన్ సింగ్.

ఆదివారం సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ జరిగిన చర్చల్లో ఈ కంచెను నిర్మించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చామని  అక్రమ చొరబాట్ల తోపాటు మాదకద్రవ్యాల రవాణా కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో 70 కి.మీ. మేర కంచె నిర్మాణం ఇప్పుడు అత్యంత ఆవసరమని తెలిపారు. 

      

స్వేచ్చాయుత రాకపోకలు..  
మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని అత్యధికులు అభిప్రాయపడుతున్న కారణంగా ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. స్వేచ్చాయుత రాకపోకల నిబంధన ప్రకారం ఇటు వారు అటువైపు గానీ అటు వారు ఇటువైపు గానీ 16 కిలోమీటర్లు వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. 

తప్పనిసరి.. 
మయన్మార్ దేశం భారతదేశం సరిహద్దులో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటుండగా అందులో మణిపూర్‌లోని ఐదు జిల్లాలు మయన్మార్‌తో మొత్తంగా 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చు తోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమైతే ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆవసరమని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: డిసెంబర్‌లోనే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ సేవలు!

మరిన్ని వార్తలు