మణిపూర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో గ్రామ పెద్ద సహా ఐదుగురు మృతి

13 Oct, 2021 11:00 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని బి గామ్నమ్‌ గ్రామంలోకి మంగళవారం ఉదయం అనేకమంది చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఎంపీ ఖుల్లెన్‌ గ్రామ పెద్దతో పాటు ఎనిమిది సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే కుకీ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా ఈ ఘటనను మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్రవాద చర్యగా అభివర్ణించారు.
చదవండి: Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?

ఈ ఘటన కుకీ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన రెండు రోజుల తర్వాత చోటుచేసుకుంది. ఆదివారం నాడు మఫౌ డ్యామ్‌ సమీపంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటేచేసుకున్న విషయం తెలిసిందే. కుకీ ఉగ్రవాదుల సంచారం ఎక్కువగా ఉందన్న సమాచారంతో అక్కడ భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయం తెలిసిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు ప్రతిదాడి చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు మృతిచెంచారు.
చదవండి: రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు

ఉగ్రవాదుల మృతికి సంతాపంగా బి గామ్నమ్ ప్రాంతంలో ఎంపీ ఖుల్లెన్ గ్రామస్తులు మంగళవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే కొందరు ఉగ్రవాదులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రామ పెద్దతో పాటు నలుగురు పౌరులు మరణించారు.

మరిన్ని వార్తలు